పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 22: హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే వాతావరణంలో అనేక ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయని, మనుషులు తమ స్వార్థ అవసరాల కోసం పర్యావరణాన్ని కాపాడడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అత్యంత ఇష్టమైన పనుల్లో మొక్కలు నాటడం ప్రధానమైనదని పేర్కొన్న ఆయన, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి విస్తృతంగా మొక్కలు నాటాలని కోరారు. అలాగే రానున్న రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ క్రమంగా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

