ముందస్తు సమాచారం లేకుండా 90 మంది RTC కాంట్రాక్ట్ కండక్టర్ల తొలగింపు
ఆర్టీసీ RM కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 22: హనుమకొండ జిల్లా వరంగల్ రీజియన్ ఆర్టీసీలో గత ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న సుమారు 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్లను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే విధుల్లోంచి తొలగించడం తీవ్ర కలకలం రేపింది. ఈ నిర్ణయానికి నిరసనగా బాధితులు శనివారం హనుమకొండలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RM) కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఏడాది కాలంగా నిరంతరాయంగా సేవలు అందించామని, ముఖ్యంగా మేడారం మహాజాతర వంటి కీలక సమయాల్లో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సేవలను వాడుకుని, ఇప్పుడు ఉన్నపళంగా ఉద్యోగాల నుంచి తొలగించడంతో తమ కుటుంబాలు వీధిపాలయ్యే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, తమను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

