జమ్మికుంట ఆదిత్య ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం: 70 ఏళ్ల రైతుకు పునర్జన్మ
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 23: జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో జనరల్ సర్జన్ డాక్టర్ మహిపాల్ నేతృత్వంలో ఓ వయోవృద్ధుడికి నిర్వహించిన అరుదైన, అత్యంత క్లిష్టమైన హైడాటిడ్ సిస్ట్ శస్త్రచికిత్స విజయవంతమైంది. సిరిసేడు గ్రామానికి చెందిన 70 సంవత్సరాల రైతు గత 16 ఏళ్ల క్రితం కాలేయంలోని హైడాటిడ్ తిత్తుల తొలగింపు కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే, ఆ వ్యాధి ఇటీవల కాలేయంతో పాటు పొత్తికడుపులోని పెరిటోనియం ప్రాంతానికి కూడా విస్తరించడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితిలో ఆపరేషన్ చేయడం అత్యంత ప్రమాదకరమని భావించి దాదాపు ఎనిమిది ప్రముఖ ఆసుపత్రులు శస్త్రచికిత్సకు నిరాకరించగా, బాధితుడి కుటుంబ సభ్యులు చివరకు జమ్మికుంటలోని ఆదిత్య ఆసుపత్రిని సంప్రదించారు.రోగికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ మహిపాల్, కాలేయంలో సుమారు 12 పరాన్నజీవి తిత్తులు ఉన్నట్లు గుర్తించి ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ పద్ధతి ద్వారా శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అత్యంత జాగ్రత్తగా ఆపరేషన్ నిర్వహించి, కాలేయం , పొత్తికడుపులోని తిత్తులను, వాటి గోడలను సురక్షితంగా తొలగించారు. ఈ సమయంలో పరాన్నజీవులు శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ప్రత్యేకమైన స్కోలిసైడల్ ఏజెంట్‌ను ఉపయోగించారు. సాధారణంగా తీవ్ర ముప్పుతో కూడుకున్న ఈ క్లిష్టమైన ఆపరేషన్‌ను గ్రామీణ ప్రాంతంలో, అతి తక్కువ ఖర్చుతో విజయవంతంగా పూర్తి చేయడం పట్ల రోగి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ మహిపాల్‌తో పాటు ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యుల సేవలతో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ధ్యేయమని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

