ఫీజు బకాయిలు విడుదల చేయాలని హనుమకొండలో బీజేపీ, బీజేవైఎం నిరసన దీక్ష
హన్మకొండ,వి90 న్యూస్,ఆగస్టు 29: రాష్ట్రంలో పేరుకుపోయిన రూ. 15 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని ఏకశిలా పార్కు వద్ద బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరుతో ఒక్కరోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

