Social 1080×1350 • Multi-page
30-08-2026 BREAKING NEWS 09:10 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఆలంపూర్ ఆలయాల అభివృద్ధికి నిరంతర కృషి: రూ.700 కోట్లతో పర్యాటక రంగ వికాసం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆలంపూర్ ఆలయాల అభివృద్ధికి నిరంతర కృషి: రూ.700 కోట్లతో పర్యాటక రంగ వికాసం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
IMG-20260830-WA0052

జోగులాంబ గద్వాల,వి90 న్యూస్,ఆగస్టు 30: ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన ఆలంపూర్ క్షేత్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరిన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం ఆలంపూర్ ఆలయాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీమీడియా, సౌండ్ అండ్ లైట్ షోను ఎంపీలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు ప్రతిరోజూ సాయంత్రం 25 నిమిషాల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. తాను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలోని 15 ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించామని, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంతో పాటు గోల్కొండ, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద కూడా సౌండ్ అండ్ లైట్ షోలు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. అలాగే అమృత్ పథకంలో భాగంగా జోగులాంబ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించామని, ఆలంపూర్ పురోగతికి స్థానికులు ఇచ్చే సూచనలను స్వాగతిస్తామని చెప్పారు.మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రసాద్ పథకం ద్వారా ఆలంపూర్ వద్ద అన్నదాన భవనం, విశ్రాంతి గదులు, ఫుడ్ కోర్ట్, కల్చరల్ థియేటర్‌తో పాటు తుంగభద్ర నదిలో బోటింగ్ వసతులు కల్పించినట్లు వివరించారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఈ సాంస్కృతిక ప్రదర్శనతో టెంపుల్ టూరిజం గణనీయంగా పుంజుకుంటుందని, డోర్నకల్ – గద్వాల రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.