Social 1080×1350 • Multi-page
02-09-2026 BREAKING NEWS 08:43 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్‌ రెడ్డి
FB_IMG_1788361326431

డిల్లీ,వి90 న్యూస్,సెప్టెంబర్ 02: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించారు. పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన సీఎం, డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు. సదస్సులో భాగంగా ఏర్పాటు చేసే డిఫెన్స్ ఎక్స్‌పో 2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల సదస్సులతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. దేశవ్యాప్త రక్షణ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సంపూర్ణ సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులతో పాటు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. త్రివిధ దళాల అత్యాధునిక రక్షణ వ్యవస్థల ప్రదర్శనతో పాటు హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, DRDO వంటి ప్రభుత్వ రంగ సంస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రదర్శించేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విదేశీ రక్షణ శాఖ ప్రతినిధుల భాగస్వామ్యానికి సహకరించాలని కోరారు.ఇదే సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూ కేటాయింపులపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ కోరిన 1500 ఎకరాలలో ఇప్పటికే 750 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మిగిలిన 750 ఎకరాలను సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనని వివరించారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (DRDL) ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాల భూమిని TGIIC ద్వారా కేటాయించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఈ భూమిని మొత్తం ప్రాజెక్టుకు సంవత్సరానికి రూ. 1 నామమాత్రపు లీజుతో 33 ఏళ్ల కాలపరిమితికి కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ భేటీలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ కుమార్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు.