కాంగ్రెస్ 1000 రోజుల ప్రజాపాలన: కరీంనగర్‌లో ఘనంగా విజయోత్సవ వేడుకలు
కరీంనగర్,వి90 న్యూస్,సెప్టెంబర్ 05: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొని సందడి చేశారు. సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పురమల్ల శ్రీనులతో పాటు జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు వేడుకల్లో భాగస్వాములయ్యారు.

హుజురాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చారు. కార్యకర్తల జై కాంగ్రెస్ నినాదాలతో ఇందిరా చౌక్ ప్రాంతమంతా మారుమ్రోగింది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రాధాన్యతను వివరించేలా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకారులు, అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులతో కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వేడుకల్లో జోష్ నింపారు. అనంతరం నాయకులంతా కలిసి భారీ కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

