అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరు: BRSV నాయకుల ఆగ్రహం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 10: బిఆర్ఎస్వీ నాయకుల అక్రమ అరెస్టులను బిఆర్ఎస్వీ జమ్మికుంట టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తారనే భయంతో తెల్లవారుజామున నాలుగు గంటలకే నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆయన మండిపడ్డారు.బిఆర్ఎస్ పార్టీగానీ, బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులుగానీ, ఎమ్మెల్యే గానీ ఎలాంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వకపోయినా ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పాలన చేయడం చేతకాక, ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అరెస్టులకు పాల్పడటం పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు.ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి, ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా అమల్లోకి తేలేకపోయారని విమర్శించారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, ఇంటర్ పాసైన వారికి ₹10,000, డిగ్రీ పాసైన వారికి ₹20,000, స్కూటీలు తదితర హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.అరెస్టులతో ప్రతిపక్షాల ఉద్యమాలను అణచివేయలేరని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి, మంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ నాయకులు కొమ్ము నరేష్, నల్లగాశ హరీష్ తదితరులు పాల్గొన్నారు.

