ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన చొప్పదండి రత్నం డా. తమ్మడి అలేఖ్య
కరీంనగర్,వి90 న్యూస్,సెప్టెంబర్ 13: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామానికి చెందిన తమ్మడి అలేఖ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రతిష్టాత్మక డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. స్వామీదాస్, రాజేశ్వరి దంపతుల కుమార్తె అయిన అలేఖ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయ భూగోళ శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ డా. టీ. అనురాధ మార్గదర్శకత్వంలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు.

“తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పరివర్తన పట్టణ పరిసర ప్రాంతాల్లో భూ వినియోగ మార్పులు – కరీంనగర్ నగరాన్ని కేంద్రంగా చేసుకున్న అధ్యయనం” అనే అంశంపై ఆమె ఈ పరిశోధన సాగించారు. వేగంగా మారుతున్న సమాజం, వ్యవసాయ రంగం, పట్టణీకరణ , భూ వినియోగ విధానాలపై అలేఖ్య చేసిన ఈ అధ్యయనం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన 85వ స్నాతకోత్సవంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం చేతుల మీదుగా ఆమె ఈ డాక్టరేట్ పట్టాను స్వీకరించారు. విద్యా, పరిశోధనా రంగాల్లో విశేష కృషి చేసి డాక్టరేట్ సాధించిన అలేఖ్యను ఆమె కుటుంబ సభ్యులు, అర్నకొండ గ్రామస్థులు, అధ్యాపకులు, స్నేహితులు ఘనంగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

