Social 1080×1350 • Multi-page
15-09-2026 BREAKING NEWS 09:09 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన: పాఠశాల ఎదుట ఆందోళన, రామ్ రాజయ్యను సస్పెండ్ చేయాలని డిమాండ్

విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన: పాఠశాల ఎదుట ఆందోళన, రామ్ రాజయ్యను సస్పెండ్ చేయాలని డిమాండ్
IMG_20260915_210013

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 15: జమ్మికుంట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రామ్ రాజయ్య తీరుపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే భక్షకుడిగా మారి విద్యార్థినుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. తరగతి గదిలోనే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ, గిల్లుతూ, తీవ్రంగా టార్చర్ చేస్తున్నాడని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాలికలకు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితులు తెలిపారు.

అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడు విద్యార్థినుల తల్లుల మొబైల్ ఫోన్లకు సైతం అనుచిత సందేశాలు పంపుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ విపరీత చర్యలపై ఆగ్రహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని, పాఠశాలలో పిల్లలకు భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బాధిత కుటుంబాలు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి సదరు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశాయి.

ఈ ఘటనపై పోలీసులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలితే రామ్ రాజయ్యను వెంటనే సస్పెండ్ చేయడమే కాకుండా, ఆయనపై చట్టప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేస్తున్నారు. ఇకనైనా పాఠశాలల్లో విద్యార్థుల భద్రతను పటిష్టం చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.