సిద్దిపేట వద్ద కారు ప్రమాదం: రంగంలోకి దిగి బాధితులను కాపాడిన కేంద్రమంత్రి బండి సంజయ్
సిద్దిపేట,వి90 న్యూస్,సెప్టెంబర్ 19: సిద్దిపేట నుండి గజ్వేల్ మార్గంలో ఒక కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను అత్యంత బలంగా ఢీకొని వరుసగా పల్టీలు కొట్టింది. సిద్దిపేటలో పరీక్ష ముగించుకున్న కూతురిని తీసుకెళ్తున్న సమయంలో ఈ తీవ్ర ప్రమాదం సంభవించింది. వాహనంలో తండ్రి డ్రైవింగ్ చేస్తుండగా భార్య ముందు సీట్లో, కుమార్తె వెనుక సీట్లో ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ సమయానికి తెరుచుకోవడంతో ముందు సీట్లో ఉన్న దంపతులు క్షేమంగా బయటపడ్డారు.

అయితే వెనుక సీట్లో ఉన్న కుమార్తె తల , ముక్కు భాగాలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి.అదే సమయంలో సిరిసిల్ల పర్యటన నిమిత్తం ఆ మార్గంలో వెళ్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రమాదాన్ని గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్‌ను వెంటనే నిలిపివేసి, హుటాహుటిన ప్రమాద స్థలానికి పరుగెత్తారు. తీవ్ర భయాందోళనలో కారులో చిక్కుకుపోయిన బాధితులను తన భద్రతా సిబ్బందితో కలిసి స్వయంగా ముందడుగు వేసి సురక్షితంగా బయటకు తీశారు.

గాయపడిన వారి పరిస్థితిని చూసి చలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ , అంబులెన్స్ కోసం వేచి చూడకుండా తక్షణమే తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలోనే బాధితులను అత్యవసరంగా సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రురాలైన యువతికి తక్షణమే మెరుగైన అత్యవసర వైద్యం అందించాలని స్థానిక పోలీసులను, వైద్యులను స్వయంగా ఆదేశించి తన మానవత్వాన్ని, ప్రజా నాయకత్వ పటిమను చాటుకున్నారు. బాధితుల ప్రాణ రక్షణే ధ్యేయంగా కేంద్రమంత్రి తక్షణం స్పందించిన తీరుపై స్థానికులు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

