కామధేను పురస్కారం నా కళాసేవకు దక్కిన గుర్తింపు: నటి, దర్శకురాలు శ్రీజ సాదినేని
హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 19: చిన్నతనం నుంచి రంగస్థలంలో తాను చేసిన కృషికి గుర్తింపుగా కామధేను పురస్కారం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ రంగస్థల నటి, దర్శకురాలు శ్రీజ సాదినేని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకల సందర్భంగా చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో వంశీ సంస్థ ప్రతినిధి వంశీ రామరాజు చేతుల మీదుగా ఆమె ‘వంశీ ఎన్. ఆర్. కామధేను జాతీయ పురస్కారం’ అందుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీజ సాదినేని తన కళారంగ ప్రయాణాన్ని పంచుకున్నారు. బాలనటిగా రంగస్థల ప్రవేశం చేసిన తాను నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, యాక్టింగ్ ప్రొఫెసర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా విభిన్న రంగాల్లో అంచెలంచెలుగా ఎదిగానని వెల్లడించారు. ‘శ్రీ జయా ఆర్ట్స్’ సంస్థ ద్వారా ఇప్పటివరకు 45 నాటకాలకు దర్శకత్వం వహించానని, త్వరలోనే 50 నాటకాల మైలురాయిని చేరుకోవడమే తన తక్షణ లక్ష్యమని పేర్కొన్నారు.

సినిమా రంగానికి సంబంధించి సహ రచయితగా 125 చిత్రాలకు, డబ్బింగ్ ఆర్టిస్టుగా 400 కంటే ఎక్కువ సినిమాలకు పనిచేసిన అనుభవం తనకు ఉందని తెలిపారు. అయితే చలనచిత్ర దర్శకత్వం వహించడమే తన అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా లెజెండరీ నటీమణులు విజయనిర్మల, భానుమతి తనకు ఆదర్శమని చెప్పారు.
గతంలో నంది, గరుడ, వీణ, హనుమా, అశ్వం, భీష్మ, నందిని వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో కలిపి మొత్తం మూడువేలకు పైగా పురస్కారాలు అందుకున్నప్పటికీ, ఈ కామధేను పురస్కారం తనకు ఎంతో ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. పురస్కారాన్ని ప్రధానం చేసిన వంశీ రామరాజుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, నాటక రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొని శ్రీజ సాదినేనిని ఘనంగా అభినందించారు.

