Social 1080×1350 • Multi-page
22-09-2026 BREAKING NEWS 08:46 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం: ఉన్నతస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దళితులు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం: ఉన్నతస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
FB_IMG_1790089905515

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 22: దళితులు, గిరిజనులు, ఆదివాసీల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో నిజమైన మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST Act, 1989) అమలుపై ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ స్థాయి సమీక్షా సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఎస్సీ కమిషన్ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ వేగం, బాధితులకు అందుతున్న పరిహారం, పునరావాసంపై సుదీర్ఘంగా చర్చించారు.

గడిచిన ఐదేళ్లలో అట్రాసిటీ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎక్కువ కేసులు నమోదవుతున్న 73 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు విభాగాన్ని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా, అత్యాచార ఘటనల బాధితులకు నష్టపరిహారం అందించడంలో బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్‌ ద్వారా నిధులు విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన షాబాద్, తుక్కుగూడ ఘటనలలో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని, బడ్జెట్ నుంచి సంక్షేమ పథకాల వరకు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ఎస్సీలకు 31 శాతం, ఎస్టీలకు 17 శాతం మేర ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అలాగే పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాష్ట్రవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ వంటి నిర్ణయాలు అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం సంక్షేమ పథకాలే కాకుండా చదువు, క్రీడల ద్వారా మాత్రమే పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, పిల్లలను ఆ దిశగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.