జమ్మికుంట పద్మశాలి సేవా సంఘం నూతన అధ్యక్షుడికి మున్సిపల్ చైర్మన్ ఘన సన్మానం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 27: జమ్మికుంట పట్టణంలో ఇటీవల ఎంతో ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించిన పద్మశాలి సేవా సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అరకాల వీరేశలింగంను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంఘానికి కొత్తగా ఎన్నికైన డైరెక్టర్లకు కూడా ఆయన అభినందనలు అందజేస్తూ వారి పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలతో పాటు ప్రత్యేకించి 12వ వార్డు పద్మశాలి కుటుంబ సభ్యులతో తనకు ఎంతో కాలంగా ఆత్మీయమైన సంబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఎన్నికల్లో నూతన కార్యవర్గానికి అపార విజయాన్ని అందించిన పద్మశాలి కుల బాంధవులకు అభినందనలు తెలుపుతూ, సమాజ పురోగతికి , కుల సంక్షేమానికి తమ వంతు కృషి చేయాలని కోరారు. పద్మశాలి సమాజ అభివృద్ధికి , ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించడానికి ఎల్లవేళలా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో దిడ్డి రాము, పద్మశాలి సంఘం ముఖ్య నాయకులు, కార్యకర్తలు , కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

