జమ్మికుంట ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబుకు జాతీయ స్థాయి పురస్కారం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 02: జమ్మికుంటకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ విజయగిరి రాంబాబు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌లో ఆయనకు “సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్” అవార్డు లభించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిగ్మా అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంసీ శేఖర్, ప్రధాన కార్యదర్శి కోరముళ్ళ జనార్ధన్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

దీనితో పాటు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించనున్న ఫోటోగ్రఫీ ప్రదర్శనకు గాను “సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెంట్ ఎగ్జిబిటర్” అవార్డును కూడా రాంబాబు కైవసం చేసుకున్నారు.గత నాలుగు దశాబ్దాలుగా ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతున్న విజయగిరి రాంబాబు గిరిజనులు, ఆదివాసీల జీవనశైలితో పాటు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించడంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. లంబాడీ జీవనశైలి చిత్రాలకుగాను 2007, 2010లలో జిల్లా స్థాయిలో, 2011లో వరంగల్ రాష్ట్రస్థాయి పోటీల్లో, 2016 ఖమ్మం జాతీయ ఫోటో వర్క్‌షాప్ పర్యాటక విభాగంలో ద్వితీయ స్థానాలను సాధించారు. ఇటీవల కేబీఆర్ పార్కులో అటవీ శాఖ నిర్వహించిన “కెమెరా కళ్ళు” పోటీల్లో రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి, 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ పోటీల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో తృతీయ బహుమతి పొంది తన ప్రతిభను చాటుకున్నారు. జాతీయ స్థాయిలో మరోసారి పురస్కారం అందుకని పట్టణానికి ఖ్యాతి తెచ్చిన రాంబాబును పలువురు ఫోటోగ్రాఫర్లు, స్థానికులు, ప్రముఖులు అభినందించారు.

