అంగన్వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని తల్లులు ఉపయోగించుకోవాలి: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 03: జమ్మికుంట పట్టణ పరిధిలోని కేవీకే ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన అంగన్వాడీ పోషణ మాసం కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లులు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బలంగా, సమర్థవంతంగా పెరుగుతారని, భావి తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం తల్లులు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు.

ఆరోగ్యవంతమైన పిల్లల వల్ల కుటుంబాలకు వైద్య ఖర్చులు తగ్గి, చదువుపై దృష్టి పెట్టే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. గతంలో కోవిడ్ పాండమిక్ సమయంలో మనం నిమ్మకాయ, కషాయాల ప్రాముఖ్యతను నేర్చుకున్నట్లే, ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు ఎంతో అవసరమని గుర్తుచేశారు. ప్రభుత్వం మహిళలు, పిల్లల కోసం సెంటర్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోందని, కాబట్టి తల్లులు ఎలాంటి మొహమాటం లేకుండా తమకు రావలసిన పోషకాహారాన్ని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు లేదా స్థానిక కౌన్సిలర్లను అడిగి పొందాలని సూచించారు. సరైన పోషకాహారంతో పిల్లలను ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ , ఎంపీడీఓ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు , పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

