విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 03: జమ్మికుంట వోకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, అధిక సంఖ్యలో విద్యార్థులతో కళాశాలను సమర్థవంతంగా నడుపుతున్న యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థి దశలోని 5 సంవత్సరాల కాలం అత్యంత కీలకమని, ఈ సమయంలో కష్టపడి చదువుకుంటే భవిష్యత్తు ఎంతో సంతోషకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. చెడు అలవాట్లు, అనవసరమైన ఆకర్షణలకు దూరంగా ఉంటూ చదువు, సంస్కారాలను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కాలం చాలా వేగంగా గడిచిపోతుందని, 16 నుండి 25 సంవత్సరాల వయస్సులోనే ప్రతి ఒక్కరి జీవిత భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్ , జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కుమార్, వోకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

