వరంగల్ ఏనుమాముల వద్ద ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం భారీగా లక్షల ఆస్తి నష్టం!
వరంగల్,వి90 న్యూస్,అక్టోబర్ 04: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న సాయి ప్లాస్టిక్స్ స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. ఆదివారం కావడం, దుకాణంలో ఎవరూ లేకపోవడంతో మంటలు తీవ్రరూపం దాల్చే వరకు ఎవరూ గుర్తించలేకపోయారు.

చుట్టుపక్కల దట్టంగా పొగ అలుముకోవడంతో ఎన్టీఆర్ నగర్ నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి, నాలుగు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు 30 మంది ఫైర్ సిబ్బంది, పోలీసులు కలిసి శ్రమించి ప్రమాదాన్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఉపశమనం పొందారు. అయితే ప్రమాద తీవ్రత కారణంగా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 50 లక్షల మేర నష్టం జరిగి ఉంటుందని షాపు యజమాని ప్రాథమికంగా వెల్లడించారు.

