వరంగల్ లో అక్రమ లింగ నిర్ధారణ కేంద్రంపై దాడులు: స్టాఫ్ నర్స్, స్కానింగ్ మిషన్ అమ్మిన వ్యక్తి అరెస్ట్
వరంగల్,వి90 న్యూస్,అక్టోబర్ 04: వరంగల్ నగరంలోని కాశిబుగ్గ వివేకానంద కాలనీలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఒక కేంద్రంపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు స్పందించిన అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టగా, అనుమతి లేకుండా పోర్టబుల్ స్కానింగ్ మిషన్ ద్వారా గర్భిణులకు స్కానింగ్ చేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టంగా ధ్రువీకరించబడింది.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఇంతేజార్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి, అక్కడున్న పోర్టబుల్ స్కానింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఈ కేంద్రం నడుపుతున్న స్టాఫ్ నర్స్ చిర్ర మాధవితో పాటు, ఆమెకు ఈ స్కానింగ్ మిషన్‌ను విక్రయించిన దిలీప్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇంతేజార్‌గంజ్ పోలీసులు వెల్లడించారు.

