దసరా, సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేములవాడ భీమేశ్వరాలయం
రాజన్న సిరిసిల్ల/వేములవాడ,వి90 న్యూస్, అక్టోబర్ 05: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలైన సద్దుల బతుకమ్మ, విజయదశమి పర్వదినాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తులు ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు ఆలయ యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

వేడుకల నేపథ్యంలో ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలు, సీరియల్ సెట్లు, హై-మాస్ట్ ఫోకస్ లైట్లతో శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ మండపంలో అమ్మవారిని కొలువుదీర్చేందుకు ప్రత్యేక పూజా మండపాన్ని సిద్ధం చేస్తున్నారు.మహిళా భక్తులు బతుకమ్మ ఆడటంతో పాటు కోలాటం, దాండియా నృత్యాలు చేయడానికి వీలుగా భీమేశ్వర సదన్ వద్ద ఉన్న విశాలమైన పార్కింగ్ ప్రదేశంలో విద్యుత్ వెలుగులు, ఇతర అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నారు.

బతుకమ్మ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవస్థానం ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ముస్తాబు పనులను ఆలయ ఈఈ రాజేష్ స్వయంగా పరిశీలించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేసి, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

