Social 1080×1350 • Multi-page
06-10-2026 BREAKING NEWS 06:18 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

సమాజ హితం కోసం శిశువు మృతదేహం దానం: వంజరపల్లి దంపతుల ఆదర్శ నిర్ణయం

సమాజ హితం కోసం శిశువు మృతదేహం దానం: వంజరపల్లి దంపతుల ఆదర్శ నిర్ణయం
IMG-20261006-WA0052

వరంగల్,వి90 న్యూస్,అక్టోబర్ 06: కడుపున పుట్టిన బిడ్డ కళ్లముందే కన్నుమూసిన పుట్టెడు దుఃఖంలోనూ సమాజ హితం కోరి ఓ దంపతులు ఆదర్శంగా నిలిచారు. వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామానికి చెందిన సోమిడి త్రివేణి-వినోద్ దంపతులకు కవల పిల్లలు జన్మించగా, అందులో ఆడ శిశువు తీవ్ర శ్వాసకోశ సమస్యతో జన్మించిన మూడు రోజులకే తుదిశ్వాస విడిచింది. ఆ దుఃఖసమయంలోనూ వైద్య విద్య, పరిశోధనల కోసం బిడ్డ మృతదేహాన్ని దానం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ‘తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్’ వరంగల్ ప్రతినిధుల సమక్షంలో హన్మకొండ ఆరేపల్లిలోని ప్రతిమ మెడికల్ కాలేజ్ అనాటమీ విభాగ అధిపతికి, ప్రిన్సిపాల్‌కు శిశువు పార్థివదేహాన్ని అధికారికంగా అప్పగించారు.మూడు రోజుల పసిపాప మృతదేహాన్ని దానం చేయడం భావి వైద్యులకు, గైనిక్ వైద్య విద్యకు, శాస్త్ర పరిశోధనలతో పాటు శస్త్రచికిత్సల అవగాహనకు ఎంతో దోహదపడుతుందని, ఈ దంపతుల నిర్ణయం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అసోసియేషన్ అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి కొనియాడారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సహకరించిన దంపతుల బంధువు, ఆర్ఎంపీ వైద్యులు తోర్నె యుగంధర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డితో పాటు సిరుల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఏ. రాజేంద్రప్రసాద్, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.