ప్రముఖ యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ కన్నుమూత: తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
తిరుపతి,వి90 న్యూస్,అక్టోబర్ 07: సోషల్ మీడియా వేదికగా తనదైన హాస్య చతురతతో లక్షలాది మంది నెటిజన్లను అలరించిన ప్రముఖ యూట్యూబర్, కమెడియన్ ‘అగ్గిపెట్టి మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యులు అందించిన వైద్యానికి స్పందించక పరిస్థితి విషమించడంతో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు.యూట్యూబ్ వేదికగా విడుదలైన అనేక వినోదాత్మక వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన కిరణ్ కుమార్, ‘అగ్గిపెట్టి మచ్చ’ అనే ప్రత్యేకమైన మేనరిజం , బాడీ లాంగ్వేజ్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రజాదరణ సంపాదించుకున్నారు. స్వచ్ఛమైన రాయలసీమ యాసలో ఆయన పండించిన కామెడీ వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.అత్యంత పిన్న వయస్సులోనే కిరణ్ కుమార్ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆయన నివసించే ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన హఠాన్మరణ వార్త తెలుసుకున్న తోటి యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు, సినీ , డిజిటల్ రంగాలకు చెందిన పలువురు కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

