పత్రికల పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: సమాచార శాఖ కమిషనర్‌కు టీఎంఎస్‌పీజేఏ విజ్ఞప్తి
హైదరాబాద్,వి90న్యూస్,అక్టోబర్ 07: వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పత్రికలకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి చిన్న, మధ్యతరహా పత్రికలను ఆదుకోవాలని తెలంగాణ మీడియం, స్మాల్ డైలీ అండ్ పీరియాడికల్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీఎంఎస్‌పీజేఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సచివాలయంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ జి. ముకుందరెడ్డిని కలసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపూరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. ఈ విజ్ఞప్తిపై కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ, పెండింగ్ బకాయిల బిల్లులు ఇప్పటికే ఆర్థిక మంత్రి పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బాపూరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400కు పైగా చిన్న, మధ్యతరహా, వార, పక్ష, మాస పత్రికలు క్రమం తప్పకుండా వెలువడుతున్నాయని, ఈ రంగంపై ఆధారపడి ఐదువేల మందికి పైగా పాత్రికేయులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పత్రికల మనుగడ, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రకటనల్లో చిన్న, మధ్యతరహా పత్రికలకు కేటాయించిన 30 శాతం వాటాను పక్కాగా అమలు చేయాలని కోరారు. ప్రకటనల బిల్లుల సమర్పణతో పాటు పత్రికల ప్రచురణ క్రమబద్ధత పరిశీలనకు ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చి బిల్లుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే ప్రతి ఆరు నెలలకోసారి ఎంపానల్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తూ పక్ష పత్రికలకు కూడా అవకాశం కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రముఖుల పర్యటనల కవరేజీలో చిన్న పత్రికలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు. పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతో పాటు మారుతున్న మీడియా ధోరణులకు అనుగుణంగా శిక్షణ, పునశ్చరణ కోర్సులు నిర్వహించాలని సూచించారు. మీడియా అకాడమీ పాలక మండలిలో టీఎంఎస్‌పీజేఏకు ప్రాతినిధ్యం కల్పించి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అధికారులతో తక్షణ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, కంతేటి రమాదేవి, మిట్టపల్లి సురేందర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

