ఉద్యమకారుల హక్కుల సాధనకు మరో పోరుబాట
కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి, అలుపెరుగని పోరాటాలు సాగించిన ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న మేడారంలో నిర్వహించనున్న ‘సమ్మక్క–సారలమ్మ చలో మేడారం’ మహాపాదయాత్ర పోస్టర్‌ను గురువారం జమ్మికుంటలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టి పోరాడిన ఉద్యమకారులకు నేటికీ తగిన గుర్తింపు, గౌరవం, ప్రభుత్వపరమైన భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, వాటి అమలు ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హక్కుల సాధన కోసం ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు మేడారంలో మహాపాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ, ఉమ్మడి వరంగల్, ములుగు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జంపన్న వాగు నుంచి ప్రారంభమై సమ్మక్క–సారలమ్మ గద్దెల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు. సమ్మక్క–సారలమ్మల పోరాట స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ మహాపాదయాత్రలో ప్రతి ఉద్యమకారుడు పాల్గొని ఐక్యతను చాటాలని, ప్రజాసంఘాలు, తెలంగాణ అభిమానులు మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మూడేడ్ల కుమారస్వామి, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆరే రమేష్ రెడ్డి, నాయకులు మోతే స్వామి, పాతకాల ఓదెలు, బిట్ల శ్రీనివాస్, ఇల్లందుల శ్రీనివాస్, ఎజ్జ తిరుపతి, పోచం వెంకన్న, కన్నూరి శ్రీనివాస్, గడ్డి కొమురయ్య, గడ్డి రాములు, తోడేటి జితేందర్, యమ శ్రీనివాస్, అన్నారపు వీరస్వామి, గాజ రాజయ్య, అబ్బీడి శ్రీపాల్ రెడ్డి, దాసరి తిరుపతిరెడ్డి, బండి మల్లయ్య, ఉప్పుల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

