Social 1080×1350 • Multi-page
27-11-2026 BREAKING NEWS 10:31 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

చిన్నారుల ఆకలి తీర్చేందుకు జీవితకాల భరోసా… సాయి మానసిక వికలాంగుల కేంద్రానికి అండగా నిలిచిన సబ్బని వెంకట్

చిన్నారుల ఆకలి తీర్చేందుకు జీవితకాల భరోసా… సాయి మానసిక వికలాంగుల కేంద్రానికి అండగా నిలిచిన సబ్బని వెంకట్
IMG_20261127_122146

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 27: సేవ అంటే కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలోనే నిజమైన మానవత్వం దాగి ఉందని సబ్బని వెంకట్ మరోసారి నిరూపించారు. జమ్మికుంట పట్టణంలోని సాయి మానసిక వికలాంగుల కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల యోగక్షేమాలను, ఆరోగ్య పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్నారులకు అందుతున్న వైద్య సదుపాయాలు, పోషకాహారం, నిత్య భోజన వసతుల గురించి కేంద్రం నిర్వాహకులతో సుదీర్ఘంగా చర్చించి పూర్తి వివరాలు సేకరించారు. అక్కడి చిన్నారుల స్థితిగతులను దగ్గరగా చూసి చలించిపోయిన సబ్బని వెంకట్, వారి ఆకలి తీర్చడం మరియు నిత్య భోజన అవసరాలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో భాగంగా తాను ప్రాణాలతో ఉన్నంతకాలం ఈ కేంద్రానికి ప్రతి నెలా 50 కిలోల బియ్యాన్ని క్రమం తప్పకుండా అందిస్తానని ఆయన ఉదారంగా హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సబ్బని వెంకట్ మాట్లాడుతూ, ఈ చిన్నారులకు సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను జీవించి ఉన్నంతకాలం వీరి భోజనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, ఈ చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తనకు నిజమైన సంతృప్తిని ఇస్తుందని భరోసా కల్పించారు. సమాజంలో నిస్సహాయులకు, అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలవడమే నిజమైన మానవత్వమని సబ్బని వెంకట్ తన సేవా దృక్పథంతో అందరికీ ఆదర్శంగా నిలిచారు.