Social 1080×1350 • Multi-page
12-05-2026 BREAKING NEWS 09:37 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

అదనపు కట్నం కోసం భార్యపై భర్త కర్రతో దాడి: సింగరేణి ఉద్యోగిపై కేసు నమోదు

అదనపు కట్నం కోసం భార్యపై భర్త కర్రతో దాడి: సింగరేణి ఉద్యోగిపై కేసు నమోదు
100550910

జమ్మికుంట, వి90 న్యూస్, మే 12: నగరం గ్రామంలో అదనపు కట్నం వేధింపులు మితిమీరిపోయి, ఓ భర్త తన భార్యపై ప్రాణాపాయ స్థితిలో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కవ్వంపల్లి భాగ్యలక్ష్మికి 2012లో నగరం గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి కవ్వంపల్లి రమేష్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో ఆమె తల్లిదండ్రులు ఐదు లక్షల నగదుతో పాటు నాలుగు తులాల బంగారాన్ని కట్నకానుకలుగా సమర్పించి వైభవంగా వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత కొన్నేళ్ల పాటు కాపురం సాఫీగానే సాగింది. అయితే గత నాలుగు సంవత్సరాలుగా రమేష్ మద్యానికి బానిస కావడంతో అసలు సమస్యలు మొదలయ్యాయి. నిత్యం మద్యం తాగి ఇంటికి వస్తూ భాగ్యలక్ష్మిని శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించాడు.అదనపు కట్నం తీసుకురావాలని, లేదంటే ఇల్లు వదిలి వెళ్లాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు తన పుట్టింటి వారికి గోడు వెళ్లబోసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు గత నెల 11వ తేదీన 50 వేల రూపాయలను అదనపు కట్నంగా ఇచ్చారు. అంతటితో ఆగని రమేష్, పెళ్లి సమయంలో ఆమెకు పెట్టిన నాలుగు తులాల బంగారాన్ని కూడా తన జల్సాల కోసం కుదువ పెట్టాడు. ఈ క్రమంలో గ్రామంలో సర్పంచ్ సంపత్ ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పినప్పటికీ రమేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. తాజాగా ఈ నెల 11వ తేదీన మత్తులో ఇంటికి వచ్చిన రమేష్, తలుపులు వేసి ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రతో తలపై బలంగా కొట్టాడు. గాయమై రక్తం కారుతున్నా కనికరం లేకుండా గదిలో బంధించి, ఈరోజు నిన్ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.