Social 1080×1350 • Multi-page
02-06-2026 BREAKING NEWS 06:46 PM
v90news.com
ప్రతి పదం ప్రజా హితం

నరసింహులపల్లెలో కుల వివక్ష దావాగ్ని: దహన సంస్కారాలకు పంచాయతీ ట్రాక్టర్ నడపనన్న డ్రైవర్, దళిత సంఘాల తీవ్ర ఆగ్రహం

నరసింహులపల్లెలో కుల వివక్ష దావాగ్ని: దహన సంస్కారాలకు పంచాయతీ ట్రాక్టర్ నడపనన్న డ్రైవర్, దళిత సంఘాల తీవ్ర ఆగ్రహం
100568096

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూన్ 02: వీణవంక మండలంలోని నర్సింహులపల్లి గ్రామంలో మానవత్వాన్ని మంటగలిపేలా దారుణమైన కుల వివక్ష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వంతడుపుల పోచమ్మ ఇటీవల మరణించగా, అంత్యక్రియల నిమిత్తం గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను కేటాయించాలని కుటుంబ సభ్యులు సర్పంచ్‌ను కోరారు. సర్పంచ్ సానుకూలంగా స్పందించి వాహనాన్ని ఉపయోగించుకోవాలని తెలిపినప్పటికీ, పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ కందం కిషన్‌రావు (MPW) మాత్రం తీవ్ర అహంకారంతో వ్యవహరించాడు. తక్కువ కులం వారి అంత్యక్రియలకు తాను ట్రాక్టర్ నడపనని, అలా చేస్తే వాహనం మైలపడుతుందని (ముట్టుడు అవుతుందని) అత్యంత హేయంగా మాట్లాడాడు. మృతురాలి కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషిస్తూ, హుకుం జారీ చేస్తూ తీవ్ర మనోవేదనకు గురిచేశాడు.నేటి ఆధునిక సమాజంలో ఇంకా ఇలాంటి అణచివేతలు, కుల వివక్ష కొనసాగడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వంతడుపుల బాబు, జిల్లా కార్యదర్శి మాడ్గుల ఓదెలు, వంతడుపుల అరుణ్ తదితరులు బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్రకుల అహంకారంతో ప్రభుత్వ వాహనాన్ని నడపడానికి నిరాకరించి, దళితులను కించపరిచిన కిషన్‌రావుపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ప్రజాస్వామ్య సమాజంలో ఇలాంటి ఘటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, నిందితుడైన డ్రైవర్‌పై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు , గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అతడిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని, హుజురాబాద్ ఏసీపీ, కరీంనగర్ సీపీ, జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని, వివక్షకు వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాడుతామని వారు హెచ్చరించారు.