తెలంగాణ · June 17, 2026

ఆరుట్లలో అంతర్జాతీయ స్థాయి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి/ఆరుట్ల,వి90 న్యూస్,జూన్ 17: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని ఆయన అంకితం చేశారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అద్భుతమైన సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ ఆదర్శ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించనున్నారు.

తెలంగాణలోనే మొట్టమొదటిదైన ఈ పాఠశాలను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఆవరణ అంతా తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదే వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి, స్వయంగా విద్యార్థినీ విద్యార్థులతో కలిసి కూర్చుని అల్పాహారం తీసుకున్నారు.ఈ పర్యటనలో భాగంగా అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీతో పాటు ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ సైన్స్ ల్యాబరేటరీల్లోని సౌకర్యాలను, వివిధ శాస్త్రీయ పరికరాలను ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించారు.

విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత రవాణా బస్సులను, నృత్యం , సంగీతం బోధించే ప్రత్యేక గదులను సందర్శించారు. అనంతరం పాఠశాల వంటగదిని పరిశీలించిన రేవంత్ రెడ్డి, అక్కడ వంటవారితో ఆత్మీయంగా ముచ్చటిస్తూ పూరీల తయారీలో వారికి కాసేపు సహకరించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.క్రీడలకు ఇక్కడ కల్పించిన ప్రాధాన్యతను పరిశీలిస్తూ వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ క్రీడాస్థలాలను, టెన్నిస్, క్యారమ్స్ హాళ్లను, అందమైన పార్కులను ముఖ్యమంత్రి వీక్షించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన కొద్దిసేపు సరదాగా ఫుట్‌బాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. అత్యంత అహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ ఉత్సవంలో విద్యార్థులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకగా, ఆయన వారి వద్దకు వెళ్లి కరచాలనం చేస్తూ ఆశీస్సులు అందజేశారు.

ఈ జ్ఞాపకార్థం పాఠశాల ఆవరణలో ఒక మొక్కను నాటారు.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర ఐటీ , విద్యాశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు, శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులు , ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor