సర్వమత సమ్మేళనానికి వేదిక: వైభవంగా ప్రారంభం కానున్న బిజగిరి షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలు

1
IMG-20260527-WA0017

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,మే 27: మత సామరస్యానికి ప్రతీకగా, వైషమ్యాలకు చరమగీతిగా నిలిచిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిర్ షరీఫ్ గ్రామంలోని ప్రముఖ ముస్లిం పుణ్యక్షేత్రం హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి రహ్మతుల్లాహ్ అలై దర్గా ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమవుతున్నాయి. వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ దర్గా కుల, మత, వర్గ, సామాజిక భేదాలకు అతీతంగా సర్వమతాల సమ్మేళన వేదికగా నిలుస్తోంది.

ప్రతి ఏటా జిల్ హజ్ మాసంలో జరిగే ఈ ఉర్సు ఉత్సవాలు ఈ సంవత్సరం బక్రీద్ పండుగ రోజైన మే 28 నుండి మే 30 వరకు మూడు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. తమ కష్టాలు తొలగిపోవాలని, కోరికలు నెరవేరాలని వేడుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల నుండి కూడా వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలిరానున్నారు.తెలంగాణలోనే ఎంతో ప్రాశస్త్యం పొందిన ఈ బిజిగిరిషరీఫ్ దర్గా 11వ శతాబ్దంలో నిర్మితమైంది. జమ్మికుంట పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో, ప్రశాంతమైన గుట్టలు, ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దర్గా కొలువై ఉంది. ఇక్కడ హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి రహ్మతుల్లాహ్ఆలైతో పాటు ఆయన సోదరుడైన హజ్రత్ సయ్యద్ అజ్మత్ షావలీ, వీరి కుమారులైన హజ్రత్ సయ్యద్ ముర్తుజాషావళి, హజ్రత్ సయ్యద్ అక్బర్ షావలిల పవిత్ర సమాధులు ఉన్నాయి.

మధ్యయుగాల కాలంలో అరబ్బు దేశం నుండి పర్యటిస్తూ, మానవత్వమే మతం అని, విశ్వమానవ సమానత్వమే ధర్మమని చాటిన హజ్రత్ సయ్యద్ ఇంకుషావళి ఇక్కడే దర్గాను నిర్మించుకున్నారు. ఆయన జీవితకాలంలో ప్రదర్శించిన మహిమలు, బాధితుల పట్ల చూపిన కరుణ కారణంగా ఎందరో ప్రజలు సుఖశాంతులను పొందారు. నాటి నుండి నేటి వరకు నిష్టలతో వేడుకునే భక్తుల కోరికలను ఈ మహానుభావుడు తీరుస్తాడనే నమ్మకం భక్తుల్లో బలంగా నాటుకుపోయింది.ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గురువారం బక్రీద్ పర్వదినం సాయంత్రం ప్రత్యేకంగా గుసుల్ షరీఫ్ కార్యక్రమం నిర్వహిస్తారు. దర్గా ముతావళి మహ్మద్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో జరిగే చాదర్ గుల్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుండి తెచ్చిన ప్రత్యేక చాదర్లను దర్గాలోని సమాధులకు అలంకరిస్తారు. అదే రోజు రాత్రి కొత్తగూడెం వాస్తవ్యులైన కీర్తిశేషులు గాజి గోవర్దన్ మిత్రబృందం ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

అనంతరం ఉర్సు ఉత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టమైన సంధల్ షరీష్ (గ్రంధలేవనం) కార్యక్రమం మొల్లపల్లె, పెద్ద బిజిగిర్ షరీఫ్ గ్రామాల నుండి భక్తుల మేళతాళాలు, ఉత్సాహపూరిత వాతావరణం మధ్య ఊరేగింపుగా దర్గాకు చేరుకుంటుంది. ఈ పవిత్ర సంధల్‌ను భక్తిశ్రద్ధలతో సమాధులకు సమర్పిస్తారు. ఈ ఉత్సవాల సందర్భంగా మహ్మద్ ప్రవక్త ఉపదేశాలను స్మరిస్తూ నాందేడ్‌కు చెందిన మహ్మద్ సలీమ్, లాతూర్‌కు చెందిన పాషా బృందాలచే ప్రముఖ ఖవ్వాలి సమ్మేళనాలు అలరించనున్నాయి.ప్రజల అపార భక్తి విశ్వాసాలకు చారిత్రక చిహ్నంగా నిలిచిన ఈ దర్గాలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అనే తేడా లేకుండా అందరూ భాగస్వాములవుతారు. దీర్ఘకాలిక, మానసిక రోగాలతో బాధపడేవారు ఇక్కడ మొక్కుకుంటే నయం అవుతుందని, ఆరోగ్యం కుదటపడిన తర్వాత “కందుర్లు” పేరిట తమ మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. గత 19 సంవత్సరాలుగా గాజి గోవర్ధన్ మిత్రబృందం వారు ఇక్కడికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.ఈ వైభవ వేడుకల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్, జమ్మికుంట తహసిల్దార్ ఎన్. వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం, మున్సిపల్ చైర్మన్ మొలుగూరి ప్రశాంత్ దిలీప్, వైస్ చైర్మన్ మొహమ్మద్ ముంతాజ్ అలీ జావిద్, స్థానిక సర్పంచ్ రాచపల్లి వనజ-రాజయ్య, గ్రామ కార్యదర్శి ఇంగ్లే రాజు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు దర్గాను దర్శించుకుని పవిత్ర సమాధులకు చాదర్లు సమర్పించనున్నారు.ఏటికేడూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్గా ముతవల్లి కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. చారిత్రాత్మక కట్టడాలకు రంగులు వేయించి, దర్గా ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, వైద్యం, నిరంతర విద్యుత్ సౌకర్యం కోసం జనరేటర్లు, వసతి , రవాణా కొరకు ప్రత్యేక బస్సు సౌకర్యాలను దర్గా కమిటీ ప్రతినిధులు మహమ్మద్ అక్బర్ అలీ, మొహమ్మద్ ఇక్బాల్, అబ్దుల్ కరీం, తౌఫిక్ హుస్సేన్, జమాల్ అష్రఫ్, నయిముద్దీన్, షాహుస్సేన్, సర్వర్, లతీఫ్ హుస్సేన్, ఇమ్రాన్ హుస్సేన్, ఆజమ్, జలీల్, తాజ్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల భద్రత కొరకు హుజురాబాద్ ఏసిపి మాధవి, జమ్మికుంట సిఐ ఎస్. రామకృష్ణ గౌడ్ ల ఆధ్వర్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది.

About The Author

1 thought on “సర్వమత సమ్మేళనానికి వేదిక: వైభవంగా ప్రారంభం కానున్న బిజగిరి షరీఫ్ దర్గా ఉర్సు ఉత్సవాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed