“ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి”: ఐసీయూలో పరామర్శించి డాక్టర్లకు చేతులెత్తి నమస్కరించిన కేసీఆర్

0
FB_IMG_1785156200505

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 27: తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ యశోదా దవాఖానలో అత్యవసర చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు. ఆస్పత్రికి చేరుకున్న కేసీఆర్ నేరుగా పెద్ది చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులోకి వెళ్లారు. దాదాపు అరగంటకు పైగా ఐసీయూలోనే నిలుచుని, అక్కడ అందుతున్న ప్రత్యేక వైద్య చికిత్స విధానాన్ని, యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా దవాఖాన డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండి ఏఎస్ రావు, జెఎస్ రావుల నేతృత్వంలోని సీనియర్ వైద్యుల బృందం పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కేసీఆర్‌కు వివరించింది. పెద్దికి ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తున్నామని, గుండె, ఊపిరితిత్తులు , ఇతర అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే బ్రెయిన్ ఇంకా పూర్తిస్థాయిలో పునరుత్తేజం చెందాల్సి ఉందని, పరిస్థితి మెరుగుపడటానికి , స్పష్టమైన సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటల సమయం పడుతుందని స్పష్టం చేశారు.

అలాగే అమెరికా తదితర విదేశాల నుంచి కూడా నిపుణులైన డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటూ, ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ పరీక్షలతో పాటు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యం అందిస్తున్నామని వివరించారు.డాక్టర్లు ఇచ్చిన వివరణ విన్న అనంతరం కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “ఏం చేస్తారో చేయండి.. కానీ మా పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎలాగైనా కాపాడండి” అని డాక్టర్లకు చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. తమ శాయశక్తులా కృషి చేస్తామని వైద్యులు ఆయనకు భరోసా ఇచ్చారు.అనంతరం ఐసీయూ వెలుపల ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్న, కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ట, సోదరులు శ్రీనివాసరెడ్డి, రవీందర్ రెడ్డిలతో కేసీఆర్ మాట్లాడారు. వారిని ఓదారుస్తూ, గుండె నిండా ధైర్యాన్ని నింపారు. “దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు, ధైర్యంగా ఉండండి” అని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. పెద్దిని కాపాడుకోవడానికి ఎంత ఖర్చు అయినా వెనకాడేది లేదని, పార్టీ పరంగా , వ్యక్తిగతంగా శాయశక్తులా అండగా ఉంటామని, అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

డాక్టర్ల కృషి, దేవుని దయ, ప్రజల ఆశీర్వాదంతో పెద్ది త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో కోలుకుంటారని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.సుమారు 45 నిమిషాల పాటు దవాఖానలోనే ఉండి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేసీఆర్ వెంట మాజీ మంత్రులు తనీర్ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ తాటికొండ రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, బి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, బాల్క సుమన్, గ్యాదరి బాలమల్లు , పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed