దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
కొత్తపేట,వి90 న్యూస్,జూలై 27: ఆలమూరు మండలంలో దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అందించిన ఉచిత మోటార్ సైకిళ్లను ఏపీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారితో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ఘనంగా ప్రారంభించారు. మండలంలో మొత్తం ఆరుగురు దివ్యాంగులకు ఈ మోటారు సైకిళ్లు అందగా, లబ్ధిదారులంతా ఎమ్మెల్యే పర్యటనలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకుని స్వతంత్ర జీవనం సాగించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు తమ పింఛన్ రూపాయి కూడా పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచి తమను ఆదుకుందని దివ్యాంగులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వివరించారు.

అనంతరం ఆలమూరులోని ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం సోలార్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా సోలార్ యూనిట్లు అమర్చడంతో పాటు ప్రతి నెలా రూ.200 అద్దె రూపంలో చెల్లిస్తుందని పేర్కొన్నారు. అలాగే బిసి, ఓసి వర్గాలకు సోలార్ యూనిట్లపై రూ.78 వేల సబ్సిడీ అందిస్తోందని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

