తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో కాదు, తరగతి గదుల్లోనే ఉంది: ఆరుట్ల స్కూల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
రంగారెడ్డి/ఆరుట్ల,వి90 న్యూస్,జూన్ 17: ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం అనాధలు, ఆర్థికంగా చితికిపోయిన వారే చదువుకుంటారనే పాత అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చాలని, మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే గొప్ప సంకల్పంతో ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి ఒక దిక్సూచిలా నిలవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిలషించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి గురువారం ప్రారంభించారు.

ఇదే శుభ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉదయం అందించే పౌష్టికాహార బ్రేక్ ఫాస్ట్ పథకానికి కూడా ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ పాఠశాల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని పేర్కొంటూ, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు మేనేజ్‌మెంట్ కమిటీకి అభినందనలు తెలియజేశారు.ప్రభుత్వ బడుల పట్ల సమాజంలో ఉన్న అపనమ్మకాలను, అనుమానాలను పూర్తిగా పోగొట్టి, కుటుంబాలలో నూతన ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా అద్భుతంగా రాణించగలరన్న బృహత్తర ఆశయంతోనే ఈ పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు.

గతంలో విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించడంలో ఆరుట్ల స్కూల్ దిక్సూచిగా మారుతుందని, ఈ అద్భుతమైన విద్యా యజ్ఞానికి ప్రజలంతా సంపూర్ణంగా అండదండలు అందించాలని కోరారు. నిజమైన అభివృద్ధి అంటే రంగుల గోడలు, అద్దాల మేడలు కాదని, తెలంగాణ అసలు సిసలైన భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని ఆయన బలంగా నొక్కిచెప్పారు. విద్యపై పెట్టే ప్రతి పైసాను సమాజ భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా తాను భావిస్తానని, కేవలం విద్యతోనే అంటరానితనాన్ని, అసమానతలను నిర్మూలించి సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇందుకోసమే మూడు లక్షల కోట్లకు పైగా ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో ఏకంగా 8 శాతానికి పైగా, అంటే దాదాపు 26 వేల కోట్ల రూపాయలను కేవలం విద్యాశాఖపై, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసమే ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు ఈ స్కూల్‌లో 1814 మంది విద్యార్థులు చేరారని, ప్రభుత్వ బడి ముఖద్వారం వద్ద ‘సీట్లు ఖాళీ లేవు, అడ్మిషన్లు పూర్తయ్యాయి’ అని బోర్డు పెట్టే స్థాయికి తీసుకువచ్చిన స్కూల్ కమిటీని, ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

ఇక్కడి ఉపాధ్యాయులు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ అనుభవాలను పాఠాలుగా తీసుకుని భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర బడులను కూడా మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని, ఇక్కడ చదివిన పిల్లలే రేపటి దేశ భవిష్యత్తు నాయకులుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరనారీ ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి త్యాగాలు మరువలేనివని, అందుకే వారి పోరాట గడ్డపై ఈ పాఠశాలను నిర్మించామని గుర్తుచేశారు. తల్లిదండ్రులను, స్థానికులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలో భాగస్వాములను చేస్తూ ప్రతి పేద బిడ్డకు నాణ్యమైన చదువును అందించడమే తమ లక్ష్యమని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినంత మాత్రాన తక్కువ కాదని, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న తాను సైతం ప్రభుత్వ బడిలోనే చదువుకున్నానని, దేశంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న ఎందరో మహానుభావులు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చినవారేనని విద్యార్థులకు హితవు పలికారు. కేవలం తాత్కాలిక సంక్షేమ పథకాలు భవిష్యత్తును మార్చలేవని, సమాజంలో ఆత్మగౌరవంతో బతకాలంటే విద్య ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు.ఎవరెన్ని విమర్శలు చేసినా విద్యా సంస్కరణల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, కేజీ నుండి పీజీ వరకు అత్యుత్తమ విద్యతో పాటు క్రీడలను సైతం సమానంగా ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

కులాల వారీగా వేర్వేరు పాఠశాలలు పెట్టి సమాజంలో అడ్డుగోడలు నిర్మించే పాత విధానానికి స్వస్తి పలుకుతూ, అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను’ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన స్కూల్ యూనిఫారాలు, షూలు, సాక్సులు, దుప్పట్లు, బ్యాగులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ద్వారా తయారు చేయిస్తున్నామని, దీనికోసం రూ. 688 కోట్లతో టెండర్లు పూర్తి చేసి పనులు వేగవంతం చేశామని, జూలై ఆఖరు నాటికి వీటి పంపిణీ పూర్తి చేస్తామని వెల్లడించారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారిపై విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ నెల 19వ తేదీన ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ సమక్షంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి లేదా ఇతర మత్తుపదార్థాల వాడకం గురించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని విద్యార్థులను కోరారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న తరుణంలో, యువతకు అవసరమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను నేర్పించి ఉపాధి కల్పించేందుకు ‘స్కిల్స్ యూనివర్సిటీ’ని ప్రారంభించామని, మొదటి ఏడాదిలోనే మంచి ఫలితాలు రావడం సంతోషకరమన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలింపిక్స్‌లో ఆశించిన స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించలేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, క్రీడల్లో నూతన విప్లవాన్ని తెచ్చేందుకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో ‘స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామని వివరించారు. యువ అథ్లెట్లలో సరికొత్త స్ఫూర్తిని నింపేందుకే ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్ రప్పిస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఆరుట్ల పాఠశాల స్ఫూర్తితో తెలంగాణ నలుమూలలా ఉన్న 27 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

