కరీంనగర్ · July 8, 2026

కల్తీ నూనెలు, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ వాడితే కఠిన చర్యలు: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 08: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, తోపుడు బండ్ల నిర్వాహకులతో పాత మున్సిపల్ కార్యాలయంలో ఒక ముఖ్యమైన అవగాహన సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార పదార్థాల తయారీలో ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీ నూనెలు లేదా పలుమార్లు మరిగించిన వంట నూనెలను ఉపయోగించరాదని స్పష్టం చేశారు. పామాయిల్‌కు బదులుగా డబుల్ ఫిల్టర్ పల్లి నూనె లేదా సన్‌ఫ్లవర్ నూనె వంటి నాణ్యమైన నూనెలను మాత్రమే వినియోగించాలని సూచించారు. అలాగే సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు లేదా ప్లాస్టిక్ కవర్లలో టిఫిన్లు ఇవ్వకూడదని ఆదేశించారు.

వీటికి ప్రత్యామ్నాయంగా ఆకులు లేదా పర్యావరణహిత పాత్రల్లో మాత్రమే ఆహారాన్ని అందించాలని, టీ స్టాళ్లలో టీని గాజు లేదా స్టీల్ గ్లాసుల్లోనే ఇవ్వాలని స్పష్టం చేశారు.వచ్చే వారం రోజుల తర్వాత మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని కమిషనర్ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తూ దొరికితే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు జరిమానా విధించడంతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటితో పాటు బజ్జీ బండ్లు, హోటళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా చేతులకు గ్లౌజులు, తలకు హెడ్ క్యాప్, ముఖానికి మాస్క్ ధరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఐ. రమేష్, సదానందం , స్థానిక హోటల్ యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor