కరీంనగర్ · July 9, 2026

శాంతిభద్రతల పరిరక్షణకు ‘సీసీ కెమెరాల’ నిఘా అత్యంత కీలకం: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఆన్‌లైన్ గేమింగ్, డ్రగ్స్ వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్ పిలుపు

ప్రమాద బాధితులను కాపాడితే రూ. 25 వేల బహుమతి.. కమిషనరేట్ వ్యాప్తంగా మరో 700 సీసీ కెమెరాల ఏర్పాటు

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 09: శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల పాత్ర అత్యంత కీలకమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పేర్కొన్నారు. హుజురాబాద్ డివిజన్ పరిధిలోని సైదాబాద్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను, కొరపల్లి గ్రామంలోని 5 సీసీ కెమెరాలను ఆయన గురువారం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ పరిధిలోని ప్రతి మూలను నిఘా నీడలోకి తీసుకురావడమే లక్ష్యంగా మరో 700 కొత్త కెమెరాలను అమర్చనున్నట్లు ఆయన వెల్లడించారు.

అనంతరం జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ విజేతలకు సీపీ జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విస్తృత అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువత ఆన్‌లైన్ గేమింగ్ బారిన పడి డబ్బులు నష్టపోవడమే కాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటి ఘటనలపై తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనించాలని కోరారు.

యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, క్రీడలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మత్తు పదార్థాల సరఫరా లేదా వాడకంపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు తెలియజేయాలన్నారు.

వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడే వారికి ప్రభుత్వం ‘రహవీర్ పథకం’ కింద రూ. 25,000 నగదు పురస్కారం అందిస్తుందని ఈ సందర్భంగా సీపీ వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సైదాబాద్, కొరపల్లి గ్రామ సర్పంచులు రాజారామ్, మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ మాధవి, జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రూరల్ ఇన్స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతిలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor