ఐటీ కంపెనీల్లో కార్ల అటాచ్‌మెంట్ పేరిట భారీ మోసం
వరంగల్‌లో ఇద్దరు నిందితుల అరెస్ట్, మూడు కార్లు స్వాధీనం
వరంగల్,వి90 న్యూస్,జూలై 09: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏ.జే. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐటీ కంపెనీల్లో కార్లను అటాచ్‌మెంట్ చేయించి నెలకు భారీగా అద్దె ఇప్పిస్తామంటూ నమ్మించి, వాహన యజమానులను మోసం చేస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కార్లను అద్దెకు తీసుకొని వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కాజేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక మారుతి డిజైర్, మారుతి ఎర్టిగా, మారుతి బలెనో సహా మొత్తం మూడు కార్లను, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. మొహమ్మద్ సోహైల్ అనే బాధితుడికి చెందిన మారుతి డిజైర్ కారును ఐటీ కంపెనీలో పెడితే నెలకు రూ.35 వేల అద్దె వస్తుందని నమ్మించి ప్రధాన నిందితుడు సింగారపు శ్యామ్ కుమార్ తీసుకున్నాడు. మొదట్లో అడ్వాన్స్‌గా రూ.35 వేలు చెల్లించిన శ్యామ్ కుమార్, ఆ తర్వాత సదరు వాహనాన్ని ఇతరుల వద్ద తాకట్టు పెట్టాడు. యజమానికి అద్దె చెల్లించకుండా మోసానికి పాల్పడటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం తెలంగాణ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న సింగారపు శ్యామ్ కుమార్ (A1), ఎం.డి. సోహైల్ (A2)లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు తమ నేరాన్ని అంగీకరించడంతో నిందితులను అరెస్ట్ చేశారు.నిందితుల ఇచ్చిన సమాచారంతో తెలంగాణ జంక్షన్ వద్ద ఒక కారును, చింతల్ ఫ్లైఓవర్ కింద దాచిపెట్టిన మరో రెండు కార్లను, నేరానికి ఉపయోగించిన కీప్యాడ్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన సింగారపు శ్యామ్ కుమార్‌కు గతంలోనూ ఇలాంటి నేర చరిత్ర ఉందని, చెన్నారావుపేట, ఇంటేజార్‌గంజ్, ఏ.జే. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లలో అతనిపై పలు కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఇతర బాధితులను గుర్తించేందుకు, మిగిలిన వాహనాలను స్వాధీనం చేసుకునేందుకు డిజిటల్, ఆర్థిక ఆధారాలను సేకరిస్తున్నామని దర్యాప్తు అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏ.జే. మిల్స్ కాలనీ పోలీసులు స్పష్టం చేశారు.

