కరీంనగర్ · July 13, 2026

హుజూరాబాద్‌లో మహిళ హత్య కేసు: 36 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 13: హుజూరాబాద్ లోని మామిండ్లవాడకు చెందిన చింత సునీత (35) హత్య కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. హత్య జరిగిన కేవలం 36 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు హుజూరాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి సోమవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చింత సునీత భర్త కుమార్ మృతి చెందడంతో, గత ఐదు సంవత్సరాలుగా మోతే కిరణ్ అనే వ్యక్తితో మామిండ్లవాడ గ్యాస్ గోదాం సమీపంలో ఓ అద్దె ఇంటిలో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పక్కింట్లో ఉండే ముతోజు భాగ్య అనే మహిళతో సునీతకు స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ కలిసి తిరుగుతుండటంతో సునీతపై కిరణ్ అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానమే వారి మధ్య తరచూ గొడవలకు కారణమైంది. ఈ నెల 10న ఇద్దరూ కలిసి మద్యం సేవించిన సమయంలో మళ్లీ గొడవ జరగడంతో, ఆగ్రహానికి గురైన కిరణ్ ముందుగా సునీత గొంతును చేతులతో పిసికి, ఆపై చీర ముక్కతో గొంతు బిగించి, కాలితో మెడపై తొక్కి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని తీసుకెళ్లి ఆమె స్నేహితురాలైన భాగ్య ఇంటి సమీపంలోని బావిలో పడేశాడు. మృతురాలి లో దుస్తులను బావి సమీపంలోని చెట్టు వద్ద పడేసి కరీంనగర్ పారిపోయాడు.ఈ కేసు దర్యాప్తు కోసం సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా, సోమవారం నిందితుడు తిరిగి హుజూరాబాద్‌కు వచ్చాడనే పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు కిరణ్ తన నేరాన్ని స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. నిందితుడు చూపించిన సంఘటనా స్థలం నుండి పగిలిన గాజు ముక్కలు, పుస్తెల పూసలు, కాలి పట్టి వంటి కీలక ఆధారాలతో పాటు బావి సమీపంలో పడేసిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఏసిపి తెలిపారు. మహిళ హత్య కేసును కేవలం 36 గంటల్లోనే ఛేదించి నిందితుడిని పట్టుకున్న సిఐ కరుణాకర్, ఎస్ఐలు రవి, శ్రీనివాసరావు , సిబ్బంది మోహన్, అవినాష్, మహేందర్, శ్రీధర్, అనిల్ లను ఏసిపి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor