ఆంధ్ర ప్రదేశ్ · July 13, 2026

ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనులకు శ్రీకారం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసల జల్లు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

ఆంధ్రప్రదేశ్/కొత్తపేట,వి90 న్యూస్,జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. చారిత్రాత్మక ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.150 కోట్ల వ్యయంతో 117 నూతన గేట్ల ఏర్పాటు , మరమ్మత్తు పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం ఈ ప్రాంత రైతాంగం చేసుకున్న అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పిచ్చుకలంకలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి సభలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, ఎంపీ హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్‌లతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వ హయాంలో బ్యారేజ్ గేట్లకు గ్రీజు పెట్టే నాథుడే కరువయ్యాడని, కనీస మరమ్మత్తులు చేయకపోవడంతో బ్యారేజీ ఉనికికే ప్రమాదం వాటిల్లిందని విమర్శించారు. గోదావరి డెల్టా రైతాంగాన్ని కాపాడాలనే సంకల్పంతో అపర భగీరథుడిలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆధునికీకరణ పనులు చేపట్టారని ప్రశంసించారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నారని ఆయన కొనియాడారు.

నాడు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఊపిరి పోసిన చంద్రబాబు, నేడు పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నారని, సెంట్రల్ డెల్టాను కాపాడడానికి లొల్ల లాకుల పునర్నిర్మాణానికి వెంటనే రూ.74.20 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బిందు సేద్యం, ప్రకృతి సేద్యం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.ఇదే వేదికపై కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, పిచ్చుకలంకను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, ఏటిగట్ల బలోపేతం, నదీపాత నివారణ చర్యలతో పాటు కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయ స్థల కేటాయింపు, ఎమ్మార్వో కార్యాలయం, వివిధ వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే పేరూరు వై జంక్షన్ నుంచి రావులపాలెం జాతీయ రహదారి అభివృద్ధిని త్వరితగతిన పూర్తి చేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, ఈ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor