రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్ర మంత్రిమండలి అనుమతి ఇప్పించండి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
డిల్లీ, వి90 న్యూస్ జూలై 14: తెలంగాణలో రహదారుల నెట్‌వర్క్ విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో, పనుల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి అనుమతి ఇప్పించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలు రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తికావడమే కాకుండా నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు కూడా వెంటనే మంజూరు చేయాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.

ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరుసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్ – విజయవాడల మధ్య దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు, బందరు పోర్ట్‌కు సరకు రవాణా ఎంతో వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. వీటితో పాటు నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, జలాశయాల పరిధిలో ఉండే మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు చొరవ చూపాలని కేంద్ర మంత్రిని కోరారు.రాష్ట్రంలో ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా, మంచిర్యాల నుంచి హైదరాబాద్‌కు ఆరు వరుసల రహదారికి అనుమతులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చేపడుతుందని, ఇది వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందని వివరించారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

