జాతీయం · July 14, 2026

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించండి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

డిల్లీ,వి90 న్యూస్,జూలై 14: తెలంగాణలో వైమానిక రంగాన్ని బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఆ శాఖ కార్యాలయంలో సమావేశమై వరంగల్ (మామునూరు), ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ రెండు విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా వరంగల్ నగరం రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానమై ఉండటమే కాకుండా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల వల్ల పారిశ్రామికంగా కీలకంగా మారుతోందని, ఇది ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటికీ కేంద్ర బిందువు అవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో వరంగల్ విమానాశ్రయంలో ఎంఆర్‌వో, ఎయిర్‌కార్గో, హ్యాంగర్ వసతులతో పాటు విమాన శిక్షణా సంస్థలను నెలకొల్పాలని కోరారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ఇప్పటికే పూర్తయినందున వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని, 2028 జూన్ 2 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో వరంగల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్లపై కూడా ఆసక్తికర చర్చ జరిగింది. వరంగల్ నగరానికి ఉన్న ఘనమైన చరిత్రను ప్రతిబింబించేలా, కాకతీయ సంస్కృతికి అద్దం పట్టేలా విమానాశ్రయ డిజైన్లు ఉండాలని ముఖ్యమంత్రి కోరగా, కేంద్ర మంత్రి అందుకు పూర్తిగా సుముఖత వ్యక్తం చేశారు.

ఇదే తరుణంలో ఆదిలాబాద్‌లో రక్షణ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌పోర్ట్‌తో పాటు పౌర విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని, దానికి అవసరమైన భూమిని సేకరించి ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లోనూ ఎంఆర్‌వో, కార్గో సేవలను అందుబాటులోకి తేవాలని కోరారు. వీటితో పాటు హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి సీప్లేన్‌లు నడిపే అంశాన్ని పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనపై కేంద్ర మంత్రి స్పందిస్తూ, పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని కోరారు.భూసేకరణ విషయంలో దేశంలో ఎక్కడా లేనంత త్వరితగతిన స్పందించి రికార్డు సృష్టించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఎన్నికల సమయానికే పరిమితమని, కేంద్రంతో ఎక్కడైనా సమాచార లోపం ఉంటే చర్చల ద్వారా అధిగమిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్‌ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు , కేంద్ర పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor