మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసిన వొడితల ప్రణవ్: హుజురాబాద్ అభివృద్ధి, సంక్షేమ నిధులపై విజ్ఞప్తి
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 16: హుజురాబాద్ నియోజకవర్గంలో అంబేద్కర్ భవన నిర్మాణం, దళిత బంధు లబ్ధిదారుల సమస్యలు, సంక్షేమ నిధుల మంజూరుపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు వినతులు అందాయి. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.హుజురాబాద్ పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మంత్రిని కోరారు. గత ప్రభుత్వంలో ఈ భవనానికి ప్రొసీడింగ్ ఇచ్చినప్పటికీ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయిందని, కాబట్టి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు నియోజకవర్గంలో నిలిచిపోయిన దళిత బంధు గ్రౌండింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులందరికీ దళిత బంధు సహాయం అందేలా చూడాలని కోరారు. అలాగే హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ విజ్ఞప్తులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు. దళిత బంధు గ్రౌండింగ్ ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని, అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని సంక్షేమ భవనాలు, పాఠశాలల సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

