క్రీడాకారులకు ప్రభుత్వ అండ: టీజీ-20 విజేతలను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

0
FB_IMG_1784259998690

హైదరాబాద్/వి90న్యూస్,జూలై 17: తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగానికి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి నగదు పురస్కారాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇటీవల అత్యంత విజయవంతంగా ముగిసిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్ విజేత హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా విజేతలను సాదరంగా అభినందించిన ముఖ్యమంత్రి, వారికి నగదు బహుమతుల చెక్కులను అందజేసి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే సరికొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడంతో పాటు ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వివరించారు. గచ్చిబౌలి క్రీడా ప్రాంగణాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్న ఆయన, గతంలో హైదరాబాద్ నగరం అనేక జాతీయ స్థాయి క్రీడలకు విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన తీరును గుర్తుచేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి, వారికి సరైన వేదికను కల్పించడంలో టీజీ20 లీగ్ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.జీవితంలో లేదా ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పక్కా లక్ష్యం, నిరంతర శ్రమతో పాటు ఎంచుకున్న రంగంపై గౌరవం, అమితమైన ఆసక్తి ఉండాలని ముఖ్యమంత్రి క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. క్రీడాకారులు దేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా ఎదగాలని పిలుపునిచ్చారు. అత్యంత ఉత్సాహభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్, దేశ గర్వించదగ్గ ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed