కరీంనగర్ · July 21, 2026

ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన పోలీసింగ్: కరీంనగర్ సీపీ గౌష్ ఆలం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట, వి90 న్యూస్ జూలై 21: ప్రజా భద్రత పోలీసింగ్ ప్రధాన లక్ష్యమని, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి మూలమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.

మంగళవారం ఇల్లందకుంట మండలంలో విస్తృతంగా పర్యటించిన సీపీ, గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నివారణతో పాటు దర్యాప్తు వేగవంతమవుతుందని పేర్కొన్నారు.

అనంతరం వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని వివరించారు.విద్యార్థులకు అత్యవసర పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు ముద్రించిన ఎగ్జామ్ ప్యాడ్లను, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను సీపీ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రాణ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో మాదకద్రవ్యాలు, సైబర్ మోసాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు.

పర్యటనలో భాగంగా ఇల్లందకుంట పోలీస్ స్టేషన్, జమ్మికుంట రూరల్ సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించడంతో పాటు, నూతనంగా ప్రతిపాదించిన ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన నిర్మాణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సై, ఇతర పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor