కరీంనగర్ · July 23, 2026

హుజూరాబాద్‌లో కుప్పకూలిన లా అండ్ ఆర్డర్: సీపీ గౌస్ ఆలం వైఫల్యంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపాటు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 23: కరీంనగర్ జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు, దోపిడీలు, చోరీలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయని, జిల్లా పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కరీంనగర్ భగత్‌నగర్‌లో దుండగులు కుటుంబ సభ్యులను ఆయుధాలతో బెదిరించి, తాళ్లతో బంధించి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లడం, అంతకుముందు పీఎంజే జ్యువెలరీ దోపిడీ, హుజూరాబాద్‌లో మామిండ్లవాడ మహిళ హత్య, మెడికల్ షాప్ ఎదుట బైక్ చోరీ, నిర్వాణ హోటల్, అన్నపూర్ణ థియేటర్ పరిసరాల్లో వరుస దొంగతనాలు, అలుగునూరు వద్ద అడ్వకేట్‌పై హత్యాయత్నం వంటి ఘటనలు పోలీసుల వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.కరీంనగర్ సీపీ గౌస్ ఆలం కేవలం నేరాలు జరిగిన తర్వాత మీడియా సమావేశాలు పెట్టడానికే పరిమితమయ్యారని, నేరాలను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలన కేసుల్లో ఇప్పటికీ ప్రధాన నిందితులను అరెస్ట్ చేయలేకపోవడం, అసలు నేరస్తులను పట్టుకునే బదులు కేసులను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేరస్తులకు భయం లేకుండా పోయిందని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ బలహీనపడిందని విమర్శించారు. హుజూరాబాద్ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు పూర్తి భద్రత కల్పించాలని, ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను వెంటనే ఛేదించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, ప్రతి నేరానికి ప్రభుత్వం, పోలీసు శాఖే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor