ఢిల్లీలో విద్యార్థులపై అణచివేతను నిరసిస్తూ బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా

0
1006209447

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత, దమనకాండకు నిరసనగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు బిఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులతో పాటు పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్ఎస్వి నాయకులు, విద్యార్థులు బిగ్గరగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ.. నవతరం మేల్కొంటోందని, యువత ఆగ్రహానికి గురైతే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిబిఐ, ఈడి, ఐటి బెదిరింపులకు ఈ తరం బెదిరేది లేదని, విద్యార్థులు కోరేది అధికారం కాదని, కేవలం న్యాయం, మెరుగైన భవిష్యత్తు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అని ప్రచారం చేసుకుంటూ ‘లీక్ ఇన్ ఇండియా’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదని, బాధితులైన విద్యార్థులకు సంఘీభావం తెలిపే ఉద్యమమని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ నిర్మాతలైన యువత ప్రశ్నించడం మొదలుపెట్టిందని, కేంద్రం వీటికి సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ నాయకులు, బిఆర్‌ఎస్‌వి ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed