క్రైమ్ · July 24, 2026

స్కూల్ బస్సు కింద పడి యూకేజీ చిన్నారి మృతి.. కాస్లాబాద్‌లో తీరని విషాదం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రంగారెడ్డి,వి90 న్యూస్,జూలై 24: రంగారెడ్డి జిల్లా చౌదర్‌గూడ మండలం కాస్లాబాద్ గ్రామంలో శుక్రవారం అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల బస్సు కింద పడి యూకేజీ చదువుతున్న సహస్ర అనే చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. కాస్లాబాద్ గ్రామానికి చెందిన కృష్ణయ్య–మనీష దంపతుల కుమార్తె సహస్ర స్థానిక అభ్యాస్ విద్యాపీఠం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజూలాగే శుక్రవారం కూడా పాఠశాలకు వెళ్లిన చిన్నారి, సాయంత్రం బస్సులో తిరుగు ప్రయాణమై ఇంటి వద్ద దిగింది. చిన్నారి బస్సు దిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీస్తుండగా, వెనుక ఉన్న సహస్రను గమనించకపోవడంతో బస్సు ఆమెపైకి ఎక్కింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే స్థానికులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్లముందే కనుమరుగైన కూతురిని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదానికి స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన చేపట్టారు. బస్సుల వద్ద సహాయక సిబ్బంది (అటెండర్లు) లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థుల రవాణా భద్రతపై విద్యాశాఖ, రవాణా శాఖ అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor