తెలంగాణ · July 24, 2026

ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 24: రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంతో పాటు రోడ్డు భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక “ట్రాఫిక్ బ్యూరో”ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రవాణా వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేసి, ఈ బ్యూరోకు పటిష్టమైన సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియాన్‌లో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని అధికారులకు సూచించారు.

కేవలం నిబంధనల అమలుకే పరిమితం కాకుండా, రద్దీ సమయాలు, కార్యాలయాల పనివేళలు, వాతావరణంలో వచ్చే మార్పులు , స్థానిక సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. నగరంలో నూతన మౌలిక సదుపాయాలు కల్పించే ముందే తగిన అధ్యయనం జరగాలని, ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్‌ను అరికడుతూ ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే హైదరాబాద్‌ వ్యాప్తంగా స్మార్ట్ సిగ్నలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, వాహనాలు ఎక్కడా నిలిచిపోకుండా నిరంతరాయంగా వెళ్లేలా అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించి సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor