తెలంగాణ · July 24, 2026

జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,జూలై 24: హైదరాబాద్‌ కోర్ అర్బన్ ఏరియా (క్యూర్) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజల ఉపాధికి విఘాతం కలగకుండా జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను తక్షణమే గుర్తించాలని తెలిపారు. గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ , వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న స్థలాలను ఇండ్ల నిర్మాణానికి సేకరించి, ఆయా శాఖలకు ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని సీఎం సూచించారు.

జనావాసాలకు దూరంగా ఇండ్లు నిర్మిస్తే పేదలకు ఉపాధి దూరమై అవి నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని, అందుకే జీవనోపాధికి వీలుగా పని ప్రదేశాలకు దగ్గరలోనే ఇళ్లను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. క్యూర్ ఏరియాలోని ఒక్కో ఫ్లాట్‌ను 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో (400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా) నిర్మించనున్నారు.ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం దాదాపు ₹11 లక్షలు కాగా, స్థలం ఉచితంగా అందిస్తూ ప్రభుత్వం ₹5 లక్షల సబ్సిడీని భరిస్తుంది. మిగిలిన ₹6 లక్షలు లబ్ధిదారుడి వాటాగా ఉండనుంది. తొలి దశలో రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, మేడ్చల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ సహా 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నియోజకవర్గాల పరిధిలో స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor