ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయం: హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్
కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 25: నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు సుదీర్ఘకాలంగా చేస్తున్న పోరాటానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. విద్యార్థుల ప్రధాన డిమాండైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కేంద్రం అంగీకరించడం విద్యార్థుల ఐక్యతకు, వారి పోరాటానికి దక్కిన గొప్ప విజయంగా నిలిచింది.గతంలో రైతుల ఉపాధి, హక్కుల కోసం సాగిన ఉద్యమానికి వంగినట్లే, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు కోసం సాగిన పోరాటానికి కూడా కేంద్రం దిగిరాక తప్పలేదు. నీట్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుండి జంతర్ మంతర్ వేదికగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు నిర్వహించి తమ నిరసన గళాన్ని వినిపించారు.

విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పక్షాన నిలబడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సాక్షిగా లోక్‌సభ, రాజ్యసభలలో ఈ అంశంపై తీవ్రంగా పోరాడారు. విపక్ష నాయకునిగా దేశంలో ఏ నేత చేయని విధంగా ప్రధాని నివాసం ముందు మెరుపు ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. పార్లమెంట్ వేదికగాను, వీధుల్లోనూ విద్యార్థుల తరఫున జంగుసైరన్ మోగించారు.రాహుల్ గాంధీ చూపిన చొరవ, పోరాటంతో దిగొచ్చిన కేంద్రం, లీకేజీల నిరోధానికి కఠిన చట్టం తెస్తామని హామీ ఇవ్వడమే కాకుండా విద్యాశాఖ మంత్రి రాజీనామాకు మార్గం సుగమం చేసింది. ఈ పరిణామం అధికార బీజేపీకి కోలుకోలేని దెబ్బ అని, ఆ ప్రభుత్వం గద్దె దిగడానికి ఇది తొలి మెట్టుగా నిలుస్తుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని, భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలు కొనసాగిస్తామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ స్పష్టం చేశారు.

