కరీంనగర్ · July 28, 2026

వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీ: మొక్కలు నాటి, మల్లారెడ్డిపల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన ఏసీపీ వి.మాధవి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/వీణవంక,వి90 న్యూస్,జూలై 28: వీణవంక పోలీస్ స్టేషన్‌లో సహాయ పోలీస్ కమిషనర్ (ACP) వి.మాధవి వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని నేరాల రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డులు, మాల్ఖానా, శాంతిభద్రతల పరిస్థితితో పాటు ప్రజలకు అందిస్తున్న సేవలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని ఈ సందర్భంగా ఏసీపీ తెలిపారు.అనంతరం వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రత, ట్రాఫిక్ పర్యవేక్షణ , అత్యవసర పరిస్థితుల్లో సీసీ కెమెరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. ప్రతి గ్రామంలో ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు జరగాలని పిలుపునిచ్చిన ఆమె, పోలీసులకు ప్రజలు సహకరిస్తే శాంతిభద్రతల పరిరక్షణ మరింత సమర్థవంతంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమాల్లో జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకటి, వీణవంక పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆవుల తిరుపతి, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు , స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor