ఉద్యోగుల పీఆర్సీని వెంటనే అమలు చేయాలి: డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి డిమాండ్

0
1006252898

కరీంనగర్/ఇల్లందకుంట,వి90 న్యూస్,జూలై 28: రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా పీఆర్సీ పెండింగ్‌లో ఉండటంతో పాటు ఆరు డీఏలు రాకుండా నిలిచిపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, వెంటనే పీఆర్సీ కమిటీ రిపోర్టును తెప్పించుకొని అమలు చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి డిమాండ్ చేశారు. ఇల్లందకుంట మండలంలో నిర్వహించిన డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని, ఒకవేళ ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఇతర డీటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ… ఆరోగ్య బీమా పథకం కోసం మే నెల నుంచి ప్రీమియం మినహాయింపులు ప్రారంభించినప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందించలేదని విమర్శించారు. వెంటనే ఉద్యోగులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. అలాగే ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్న జీవో 25ను సవరించి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి తూముల తిరుపతి మాట్లాడుతూ… టెట్ కేవలం ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాత్రమేనని, అందువల్ల అర్హత మార్కులను తగ్గించి ఎస్.సి., ఎస్.టి., బి.సి., ఓ.సి. అభ్యర్థులందరికీ ఒకే రీతిలో నిర్ణయించాలని కోరారు. అలాగే అభ్యర్థులకు వారి సంబంధిత సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్, ఇల్లందకుంట మండల అధ్యక్షులు సార్ల సంపత్, ప్రధాన కార్యదర్శి సిహెచ్. వేణు, ఎం. సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed